క్రికెట్‌ దేవుడిని మరోసారి గెలిపించండి : యువీ

సచిన్‌ టెండూల్కర్‌... భారత్‌లో క్రికెట్‌ బతికున్నంతవరకు ఈ పేరును ఎవరు మరిచిపోరు. క్రికెట్‌ ఒక మతంగా భావించే మన దేశంలో సచిన్‌ను దేవుడితో పోల్చడం సహజం. మాస్టర్‌ బ్లాస్టర్‌ తన క్రికెట్‌ చరిత్రలో లెక్కలేనన్ని రికార్డులను కొల్లగొట్టాడు. కాగా ప్రఖ్యాత లారెస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌ 2000-2020కు సంబంధించి సచిన్‌ టెండుల్కర్‌ షార్ట్‌ లిస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే సచిన్‌కు ఓటు వేసి గెలిపించాలని కోహ్లి, పలువరు ఆటగాళ్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా భారత మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ క్రికెట్‌ దేవుడికి ఓటు వేసి గెలిపించాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. 



2011 వరకు మాస్టర్‌ తన 19 ఏళ్ల కెరీర్‌లో ఎన్ని రికార్డులు సాధించినా దేశానికి మరోసారి ప్రపంచకప్‌ సాధించిపెట్టలేదనే చిన్న వెలితి మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే 2011లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌ మాస్టర్‌కు చివరి ప్రపంచకప్‌ అని బాగా ప్రచారం జరిగింది. ఆరోసారి ప్రపంచకప్‌ ఆడనున్న సచిన్‌ ఎలాగైనా దేశానికి కప్పును తీసుకురావాలని భావించాడు. అప్పటికే జట్టు కూడా ధోని నాయకత్వంలో వరుస విజయాలకు తోడు ప్రపంచకప్‌ స్వదేశంలో జరగనుడడంతో అన్నీ అనుకూలంగా మారాయి. దీంతో టోర్నీ మొదలయ్యాక టీమిండియా అప్రతిహాత విజయాలతో ఫైనలకు దూసుకెళ్లింది. ఫైనల్లో భారత్‌ శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వదేశంలో సగర్వంగా రెండోసారి ప్రపంచకప్‌ను అందుకుంది. దీంతో మాస్టర్‌ అప్పటి తన 19 ఏళ్ల నిరీక్షణ ఫలించడంతో భావోద్వేగానికి గురవుతూ మైదానంలోకి చిన్న పిల్లాడిలా పరిగెత్తుకుంటూ వచ్చిన సన్నివేశం క్రికెట్‌ ప్రేమికులు ఎప్పటికి మరిచిపోరు. అందులోనూ తన హోంగ్రౌండ్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించి భారత్‌ కప్‌ సాధించడంతో సచిన్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.